రేపు తిరుమలలో ఉట్లోత్సవం; ముగిసిన గోకులాష్టమి..

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || ౧ ||

తిరుమల: గోకులాష్టమిని తిరుమల తిరుపతి దేవస్థాన (TTD) పరిధిలోని ఆలయాల్లో శ‌నివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవారు విశేష పూజలందుకున్నారు. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీకృష్ణస్వామివారి ఆలయంలో ఉదయం స్వామివారి మూలవర్లకు అభిషేకం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంత‌రం రాత్రి 7 గంట‌లకు స్వామివారు పెద్దశేష వాహ‌నంపై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులకు దర్శనమిచ్చారు. త‌రువాత గోపూజ, గోకులాష్టమి ఆస్థానం జ‌రిగింది.

రేపు మధ్యాహ్నం నుంచి ఉట్లోత్సవం..
ఆగష్టు 17న ఉట్లోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు స్వామి వారికి స్నపన తిరుమంజనం, త‌రువాత ఊంజల్‌సేవ ఉంటాయి. సాయంత్రం 6.15 నుంచి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.

గోవింద‌రాజ‌స్వామి ఆల‌యంలో..
తిరుప‌తి గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో గోకులాష్టమి సందర్భంగా సాయంత్రం 4.30 గంటలకు శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, పురాణ ప‌ఠ‌ణం, ఆస్థానం నిర్వహించారు.

నారాయణవనంలో..
నారాయ‌ణ‌వ‌నం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం జ‌రిగింది. సాయంత్రం 5.30 గంటలకు శ్రీకృష్ణష్ణుడి అభిషేకం, అనంతరం గోకులాష్టమి ఆస్థానం, నివేదన నిర్వహించారు.

ఆగష్టు 17వ తేదీ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు కృష్ణస్వామివారి వీధి ఉత్సవం, సాయంత్రం 5 గంటలకు ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.

కార్వేటినగరంలో..
కార్వేటినగరంలోని రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, ప్రత్యేక అభిషేకం, ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. త‌రువాత‌ సాయంత్రం ఆస్థానం నిర్వహించారు.
ఆగష్టు 17న ఉట్లోత్సవం సందర్భంగా ఉదయం సుప్రభాతం, తోమల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఉత్సవర్లకు సమర్పణ, సాయంత్రం గోపూజ, ఉట్లోత్సవం , రాత్రి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

తిరుప‌తి ఒంటిమిట్టల‌లోని కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యాల్లో గోకులాష్టమి ఆస్థానం ఘ‌నంగా నిర్వహించారు.

ఈ రెండు రోజుల్లో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆల‌య అర్చకులు, విశేష సంఖ్యలో భ‌క్తులు పాల్గొన్నారు.

Follow us on social media

Phone icon
8333871117
Contact us!
WhatsApp icon
8333871117