ఉష్ట్ర వాహనధారి సన్నిధిలో వినాయక మహోత్సవాలు..

హైదరాబాద్: తాడుబందు వీరాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వినాయక మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ. నరేందర్ తెలిపారు.

కార్యక్రమాల వివరాలు..

  • 27.8.25 (బుధవారం) సాయంత్రం 6.30 గంటలకు కలశ స్థాపన, శ్రీ విఘ్నేశ్వర అర్చన; శ్రీవారి భజన మండలిచే భజన కాలక్షేపం, హారతి తీర్థ ప్రసాద వితరణ
  • 28.8.25 (గురువారం) సాయంత్రం 7 గంటలకు నాగవళ్లి దళార్చన; సంకీర్తన భజన కాలక్షేపం అనంతరం తీర్థప్రసాద వితరణ
  • 29.8.25 (శుక్రవారం) సాయంత్రం 9 గంటలకు లక్షపత్రి పూజ; సంకీర్తన భజన కాలక్షేపం అనంతరం తీర్థప్రసాద వితరణ
  • 30.8.25 (శనివారం) సాయంత్రం 7 గంటలకు గులాబి పుష్పార్చన; సంకీర్తన భజన కాలక్షేపం అనంతరం తీర్థప్రసాద వితరణ
  • 31.8.25 (ఆదివారం) సాయంత్రం 7 గంటలకు చామంతి పుష్పార్చన; సంకీర్తన భజన కాలక్షేపం అనంతరం తీర్థప్రసాద వితరణ
  • 1.9.25 (సోమవారం) ఉదయం 8.30 గంటలకు సహస్త్రనామార్చన; మంత్రపుష్పం అనంతరం తీర్థప్రసాద వితరణ
    అదే రోజు మధ్యహ్నం 12 గంటలకు ఉట్లు కొట్టు కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకు నాదస్వర మేళతాళాలతో, విద్యుదీపాలంకారంతో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఊరేగింపు అనంతరం నిమజ్జనోత్సవం ఉంటాయి.

ప్రతిరోజు గణపతి హోమం..
రోజు ఉదయం 9 గంటలకు గణపతి హోమం నిర్వహిస్తారు.

స్వామి వారి లడ్డూవేలం
1.9.25 (సోమవారం) సాయంత్రం 6 గంటలకు దేవాలయ ప్రాంగణంలో స్వామి వారి లడ్డూను వేలం వేస్తారు. నిమజ్జనం రోజున మధ్యాహ్నం 12 గంటలకు ఆలయంలో అన్నదానం నిర్వహిస్తారు.

హనుమ ఇక్కడ ఎలా వెలిశారు?
1928‌లో వీరాంజనేయ స్వామిగా ఇక్కడ వెలిశారని చెబుతారు. తొలుత ఒక చిన్న షెడ్డులో స్వామివారు పూజలందుకునేవారు.క్రమేణా దాతల సహకారంతో ఆలయం తయారైంది.

స్వామికి ఇష్టమైన రోజులు..
ప్రతిరోజు స్వామికి అభిషేకం, సింధూర అలంకరణ, పూలఅలంకరణ చేస్తారు. మంగళవారం, శనివారం బంగారు కవచం లేదా వెండి కవచంతో స్వామివారు దర్శనమిస్తారు.

భక్తుల విశ్వాసం..
ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోర్కెలు నెరవేరాలని స్వామిని ప్రార్థించి ముడుపు కడతారు. 40 రోజుల్లో వారి కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. 40 రోజుల పాటు 108 లేదా 71 ప్రదక్షిణలు చేస్తే అనుకున్నది స్వామివారు అనుగ్రహించారని మరికొంతమంది భక్తుల నమ్మకం.

ఆలయ వేళలు..
మంగళవారం, శనివారం మాత్రం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. మిగతా రోజుల్లో తెల్లవారుజామున 5 గంటలకు తెరుస్తారు. రాత్రి 8:30 కి ఆలయ తలుపులు మూసివేస్తారు.

వాహన పూజలు..
కొత్తవాహనాలు కొన్న వారు పూజ కోసం ఆలయానికి తీసుకువస్తారు. మంగళ, శనివారాల్లో వాహనాలు అధిక సంఖ్యలో వస్తాయి.

స్వామివారి వాహనం ఉష్ట్రం..
ఉష్ట్రం అంటే ఒంటె. ఆలయంలో స్వామికి అభిముఖంగా దర్శనమిస్తుంది. వాయువేగంతో ప్రయాణించే భజరంగబలికి ఎడారిలో సంచరింటే ఒంటె ఎలా వాహనం అయ్యిందన్న సందేహానికి వివరణ ‘‘పరాశర సంహిత’’ అనే గ్రంథంలో ఉంది. అందుకే హనుమంతుల వారిని ఉష్ట్రం వాహాయ విరాయ శ్రీ హనుమతే మంగళం అని ప్రార్థిస్తుంటారు.

రావణాసురుడు సీతాదేవిని అపహరించిన తర్వాత రాముడు ఆమెను వెతుక్కుంటూ పంపానది తీరానికి వస్తాడు. అక్కడ సంచరించే సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి..తన సోదరుడైన వాలి తనను సంహరించడానికి వీళ్ళని పంపాడేమోనన్న అనుమానంతో.. వాళ్ళెవరో కనుక్కొని రమ్మని తన సేవకుడైన హనుమంతుడిని రామలక్ష్మణుల దగ్గరికి పంపిస్తాడు. హనుమంతుడు సన్యాసి వేషంలో వారి వద్దకు వెళ్తాడు. శ్రీరాముడిని చూడగానే అప్రయత్నంగా హనుమంతుడిలో తన్మయత్వం కలుగుతుంది. ‘‘నీవు ఏ వ్యక్తిని చూస్తే నీ మనసు తన్మయత్వంతో పులకరిస్తుందో.. ఆ వ్యక్తిని నువ్వు గురువుగా భావించి నమస్కారం చేసి ఆయనకు సేవకుడిగా ఉండు’’ అని హనుమంతుడి తల్లి హనుమంతుడికి ఒక సందర్భంలో చెప్పి ఉంటుంది. అప్పటినుంచి హనుమంతుడు శ్రీరాముడికి దాసుడవుతాడు.

పంపానది తీరం మొత్తం ఇసుక తిన్నెలతో నిండి ఉంటుంది. ఇసుకలో వెళ్లేందుకు అనువైన వాహనం ఒంటె. దాని మీదే హనుమంతుడు రోజూ వెళ్లి రాములవారిని దర్శించుకునేవారని పరాశర సంహితలో గ్రంథంలో రాసి ఉంది. అలా ఒంటె హనుమంతుడి వాహనమైంది.

ఆలయం ఎక్కడుంది?

ఆలయ ముఖద్వారం

శ్రీ తాడుబందు వీరాంజనేయ స్వామి దేవస్థానం(ల్యాండ్‌లైన్ నెంబర్: 040-27841283)గా పిలిచే ఈ ఆలయం సికింద్రాబాద్ నడిబొడ్డున ఉంటుంది. జూబ్లీ బస్ స్టేషన్ (JBS) నుంచి 3 కి.మీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 5 కి.మీ, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఇమ్లిబన్) హైదరాబాద్ నుంచి 12 కి.మీ, శంషాబాద్ విమానాశ్రయం నుంచి 35 కి.మీ దూరంలో ఉంటుంది.

Google Map location కోసం ఇక్కడ క్లిక్ చేయండి..For Map Location – Click here

Follow us on social media

Phone icon
8333871117
Contact us!
WhatsApp icon
8333871117