ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా..

వినాయక చవితి దగ్గర పడుతుందంటే హైదరాబాద్‌ వాసులకు ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణేశుడు. ఈ సారి గణనాథుడి విగ్రహం ఎన్ని అడుగుల ఎత్తు ఉండబోతుంది? ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నాడన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. మరి ఇంకెందుకాలస్యం.. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..

69 అడుగుల ఎత్తు..
ఈ ఏడాది (2025) 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా విఘ్నేశ్వరుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. స్వామి వారికి కుడి పక్కన శ్రీజగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీసమేత హయగ్రీవ స్వామి వారు.. ఎడమవైపు లలిత త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి ఉండేలా రూపకల్పన చేశారు.

గణనాథుడి విగ్రహం 3 తలలతో ఉంటుంది. తలపై పడగవిప్పిన 5 సర్పాలు, మొత్తం 8 చేతులు ఉంటాయి. కుడివైపు చేతుల్లో పైనుంచి ఆయుధం, సుదర్శన చక్రం, అభయహస్తం, రుద్రాక్షమాల చూపుతూ ఉంటుంది. ఎడమవైపు చేతుల్లో పైనుంచి పద్మం, శంఖం, లడ్డూ ఉండనున్నాయి.

ఏటా 10 రోజుల పాటు వైభవంగా నిర్వహించే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు జనం పొటెత్తుతారు. హైదరాబాద్‌ సహా చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో స్వామిని దర్శించుకుంటారు.

ఒక్క అడుగుతో ప్రారంభమై..
ఖైరతాబాద్ గణనాథుడికి దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. 1954 నుంచి ఖైరతాబాద్‌లో గణేశ్‌ నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఉద్యమకారుడు బాల గంగాధర్ తిలక్ ఆదర్శంగా హైదరాబాద్​ నగరానికి చెందిన సింగరి శంకరయ్య 1954లో తొలిసారి ఖైరతాబాద్‌లో ఒక్క అడుగుతో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెబుతారు. అలా ఒక్కో అడుగుతో మొదలై విగ్రహం ఎత్తు పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 69 అడుగులకు చేరింది.

గిన్నిస్‌బుక్ రికార్డు..
పండుగ ఎంత ఘనంగా జరుగుతుందో.. లడ్డూ కూడా అంతే ఘనంగా ఉంటుంది. ఏటా గణనాథుడి కోసం భారీ లడ్డూ చేయిస్తారు నిర్వాహకులు. ఖైరతాబాద్ వినాయకుడి కోసం 2021 వరకు తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి లడ్డూను తీసుకొచ్చేవాళ్లు. ఈ లడ్డూ అనేక సార్లు గిన్నిస్ బుక్‌లోనూ చోటు దక్కించుకుంది. కానీ ఆ తర్వాత నుంచి స్థానికంగానే లడ్డూ తయారు చేయిస్తున్నారు.

ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జన కార్యక్రమం సాధారణంగా పండుగ తర్వాత 11వ రోజు ఉంటుంది. ఈ నిమజ్జన తేదీ అధికారికంగా వెల్లడిస్తారు. నిమజ్జనోత్సవాన్ని వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకుంటారు.

Follow us on social media

Phone icon
8333871117
Contact us!
WhatsApp icon
8333871117