తిరుపతి: చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం సాయంత్రం 3.30 నుంచి సెప్టెంబర్ 8 సోమవారం ఉదయం 3 గంటల వరకు దాదాపు 12గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పేర్కొంది. వాస్తవానికి ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సోమవారం వేకువజామున 1.31 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందు ఆలయ ద్వారాలు మూసివేయడం ఆనవాయితీ.
6గంటలకు అనుమతి..
సెప్టెంబర్ 8న ఉదయం 3 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. తర్వాత ఉదయం 6 గంటలకు స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
ఆర్జితసేవలు రద్దు..
సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు.
అన్నప్రసాద వితరణ కేంద్రాల మూత..
చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి తిరుమలలో అన్నప్రసాద వితరణ ఉండదు. తిరిగి సెప్టెంబర్ 8వ తేది ఉదయం 8.30 గంటలకు పంపిణీ తిరిగి ప్రారంభమవుతుంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ఎస్వీ ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, పీఏసీ-2 లలో అన్నప్రసాద వితరణ ఉండదు.
భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో 30 వేల పులిహోర ప్యాకెట్లను సెప్టెంబర్ 7 సాయంత్రం 4.30 గంటల నుంచి పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం, రామ్ భగీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంటర్లు, శ్రీవారి సేవా సదన్ వద్ద భక్తులకు అన్నప్రసాద ప్యాకెట్లను అందిస్తారు.
భక్తులు ఈ విషయాలను గమనించి సహకరించాలని టీటీడీ కోరుతోంది.
More Stories
ఉత్తరాఖండ్ సీఎం రిలీఫ్ పండ్‌కు YSS రూ.25లక్షల విరాళం..
ఉష్ట్ర వాహనధారి సన్నిధిలో వినాయక మహోత్సవాలు..
ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా..