తిరుపతి: తిరుమల..ఈ పేరు వింటేనే మనసు పులకరిస్తుంది. భక్తిభావంతో ఉప్పొంగుతుంది. తిరుమలేశుడి దర్శనంతో జన్మచరితార్థం అని భావించే భక్తులు కొందరైతే.. వెంకన్న సన్నిధిలో భక్తులకు సేవ చేస్తే ఆది స్వామివారికి చేసినట్టేనని భావించే భక్తులు మరికొందరు. రోజూ వేల సంఖ్యలో తిరుమలలో వలంటీర్లుగా సేవలందిస్తుంటారు. అయితే మరింత నాణ్యమైన సేవలందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థాన(TTD) శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా వలంటీర్లకు శిక్షణ ఇచ్చే శ్రీవారి సేవకులకు ముందుగా ట్రైనింగ్ ఇవ్వనుంది. వీరికి ఐఐఎం అహ్మదాబాద్, రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. సేవలో పాల్గొనాలనుకునే ప్రొఫెషనల్స్, ఎన్ఆర్ఐలకూ ప్రణాళిక సిద్ధమవుతోంది.
ఏ అంశాలపై శిక్షణ ఇస్తారు?
శ్రీవారి సేవకులు శిక్షణ కోసం ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి విడత శిక్షణ కార్యక్రమం సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమై మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఉదయం విధానపర అంశాలపై శిక్షణ, మధ్యాహ్నం వివిధ సేవా కేంద్రాలలో ఫీల్డ్ విజిట్లకు వెళ్లి పరిశీలించేలా ప్రణాళిక రూపొందించారు. శిక్షణలో శ్రీవారి వైభవం, తిరుమల ప్రాముఖ్యత, సేవాతత్వం, భక్తులకు అందించే సేవలపై అవగాహక కల్పిస్తారు.
గ్రూప్ సూపర్వైజర్లకు వయసు 45 నుంచి 65 మధ్య ఉండాలి. కనీసం డిగ్రీ చదివి ఉండాలి. సేవాకాలం 15 లేదా 30 లేదా 90 రోజులు.
సేవ ఎలా మొదలైంది?
వాస్తవానికి శ్రీవారి సేవ 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. కాంచీ కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతీ చేతులమీదుగా ప్రారంభించారు. 25 ఏళ్ల సేవా ప్రస్థానంలో ఇప్పటివరకు లక్షల మంది సేవకులు స్వచ్ఛందంగా వివిధ రకాల సేవల్లో పాలుపంచుకున్నారు. రోజుకు సుమారుగా 3,500 మంది తిరుమలలో అన్ని రకాల సేవల్లో పాల్గొంటుంటారు.
శ్రీవారి సేవకులు దిగువన ఉన్న లింకును క్లిక్ చేసి శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు..
https://ttdevasthanams.ap.gov.in/srivari-seva/instructions?accesstype=/

More Stories
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ – 2026
కన్నుల పండువగా పరమహంస యోగానంద జయంతి
హైదరాబాద్ బుక్ఫెయిర్లో ప్రపంచ ధ్యాన దినోత్సవం