తిరుమల: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను సెప్టెంబర్ 8న బదిలీ చేసింది. టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసి, ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించింది. సింఘాల్ ఇదివరకు TTD ఈవోగా పనిచేశారు. రోడ్లు భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబును, రెవెన్యూ, ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా ముఖేశ్‌కుమార్ మీనాను, అటవీ,పర్యావరణశాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
ఎవరీ అనిల్ కుమార్ సింఘాల్ ..
టీటీడీ ఈవోగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి పనిచేసిన వారిలో అనిల్ సింఘాల్ మొదటి వ్యక్తి. అలాగే ఈవోగా రెండోసారి నియమితులైన మొదటి అధికారిగా సింఘాల్ రికార్డుకెక్కారు. 1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన గతంలో 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4వ తేదీ వరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కొనసాగారు.
శ్యామలరావు గురించి క్లుప్తంగా..
తిరుమల, తిరుపతి దేవస్థానం(TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(EO)గా జంజనం శ్యామలరావు జూన్ 16,2024న బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. గతంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన సమయంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా పనిచేసి రాష్ట్రానికి ఆదాయం పెరిగేలా చేశారు. ఐఏఎస్ 1997 బ్యాచ్‌కు చెందిన శ్యామలరావును మొదట అసోం క్యాడర్‌కు కేటాయించారు. 2009-2011 మధ్యకాలంలో విశాఖ కలెక్టర్‌గా, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ ఎండీగా కూడా పనిచేశారు. శ్యామలరావు మున్సిపల్ శాఖలో ఎక్కువ కాలం పనిచేశారు.

More Stories
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ – 2026
కన్నుల పండువగా పరమహంస యోగానంద జయంతి
హైదరాబాద్ బుక్ఫెయిర్లో ప్రపంచ ధ్యాన దినోత్సవం