తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 4వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమి రోజున స్వామివారికి కైంకర్యాలు, నివేదన అనంతరం దీపోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం నేతివత్తులతో దీపాలు వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలి పీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను వెలిగిస్తారు. కార్తీక పర్వ దీపోత్సవం సందర్భంగా డిసెంబర్ 4న సహస్రదీపాలంకరణ సేవ, పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు.
డిసెంబర్ 4న తిరుమలలో ‘కార్తీక పర్వ దీపోత్సవం’
More Stories
భక్తి శ్రద్ధలతో పరమహంస యోగానంద మహాసమాధి ఆరాధనోత్సవాలు
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ – 2026
కన్నుల పండువగా పరమహంస యోగానంద జయంతి