హైదరాబాద్: చారిత్రాత్మక సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి దాడికి 1,000 సంవత్సరాలు ఇటీవల పూర్తయిన సందర్భంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ జరుపుకుంటున్నారు. జనవరి 8న ప్రారంభమైన ఈ వేడుక ఆదివారం (జనవరి 11, 2025) న ముగుస్తుంది. సోమనాథ్ ఆలయంలో నిర్వహించిన సామూహిక ఓంకార మంత్ర జపంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ఇటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం హైదరాబాద్ పంజాగుట్టలోని శ్రీ దుర్గ భవాని దేవాలయంలో శివాభిషేకం చేసి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్చార్జ్ ఎన్.వి. సుభాష్ ఉన్నారు.

1026లో సోమనాథ్ మహాదేవాలయంపై మహమ్మద్ గజినీ దాడి చేసినప్పటికీ భారతీయ ధర్మం, సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసాలు ఎప్పుడూ చెక్కుచెదరలేదని బండి సంజయ్ కుమార్ తెలిపారు. వెయ్యేళ్ల తర్వాత కూడా సోమనాథ్ ఆలయం భారతీయ నాగరికత శాశ్వత ప్రతీకగా నిలుస్తోందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పంతో పునరుద్ధరించబడిన ఆలయాన్ని 1951లో అప్పటి రాష్ట్రపతి డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ సూచనమేరకు భక్తుల దర్శనార్థం తెరిచారని గుర్తు చేశారు. 2026 నాటికి పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు (అమృతోత్సవం) పూర్తి కావడం, ఈ స్వాభిమాన పర్వ్కు ప్రత్యేక చారిత్రాత్మక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జనవరి 10‑11న గుజరాత్లోని సోమనాథ్ క్షేత్రంలో “సహస్ర సంకల్ప యాత్ర” ప్రారంభమవుతుందని, ఇందులో 108 అశ్వాల ప్రదర్శన, ఓంకార మంత్రోచ్ఛారణ, ఆలయ దర్శనం, బహిరంగ సభలు ఉంటాయని గుర్తు చేశారు. ప్రజలందరూ ఈ మహా చారిత్రాత్మక సందర్భంలో శివాలయాల్లో ఓంకార జపం, ప్రత్యేక పూజల్లో పాల్గొని ధర్మ‑సంస్కృతి పరిరక్షణలో చైతన్యంగా భాగస్వామ్యం కావాలని, ఇది మన ధర్మాన్ని, సంస్కృతిని, భారతీయ ఆత్మగౌరవాన్ని స్మరించుకునే అవకాశం అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
More Stories
భక్తి శ్రద్ధలతో పరమహంస యోగానంద మహాసమాధి ఆరాధనోత్సవాలు
కన్నుల పండువగా పరమహంస యోగానంద జయంతి
హైదరాబాద్ బుక్ఫెయిర్లో ప్రపంచ ధ్యాన దినోత్సవం