దివ్యదర్శనం, హైదరాబాద్, మార్చి 19: యోగదా సత్సంగ సొసైటీ (వైఎస్ఎస్) చేస్తున్న సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు. శతాబ్ద కాలంగా క్రియాయోగం విస్తరణలో వైఎస్ఎస్ చేస్తున్న కృషి ఎంతో గొప్పదని ఆయన కొనియాడారు.
హైదరాబాద్‌లో జరిగిన ఉగాది వేడుకల సందర్భంగా, ఒక మీడియా సంస్థ తరఫున వైఎస్ఎస్ ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానందకు చిరంజీవి పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా స్వామీజీకి శాలువ కప్పి సత్కరించారు.

స్వామి స్మరణానంద మాట్లాడుతూ, మనసు, శ్వాస మధ్య గాఢమైన సంబంధం ఉందని తెలిపారు. శ్వాసను నియంత్రించడం ద్వారా ఆలోచనలను ప్రభావితం చేయవచ్చని, తద్వారా మనసును అదుపులో పెట్టుకోవచ్చని చెప్పారు. క్రియాయోగ సాధన ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధ్యమవుతాయని వివరించారు.
‘ఒక యోగి ఆత్మకథ’ రచయిత పరమహంస యోగానంద 1917లో వైఎస్ఎస్‌ను స్థాపించారని ఆయన గుర్తుచేశారు. క్రియాయోగ ధ్యానానికి సంబంధించిన పాఠాలను వైఎస్ఎస్ నుంచి పోస్టు ద్వారా పొందవచ్చని సూచించారు.

ఖరగ్‌పూర్ ఐఐటీలో చదువుతున్న సమయంలోనే యోగానంద రచనలపై ఆకర్షితులైన స్వామి స్మరణానంద, ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినప్పటికీ, ఆధ్యాత్మిక సేవకే అంకితమయ్యారు. గత నాలుగు దశాబ్దాలుగా వైఎస్ఎస్ ద్వారా సేవలందిస్తున్నారు.
వైఎస్ఎస్ సంస్థ ఆధ్వర్యంలో అనేక విద్యా, సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రాచీన క్రియాయోగాన్ని గురుపరంపర ద్వారా ప్రజల్లోకి తీసుకువచ్చిన ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా దాని ప్రాచుర్యానికి కృషి చేస్తోంది. ముఖ్యంగా 1920 నుంచి అమెరికా, యూరప్ దేశాల్లో క్రియాయోగ విస్తరణకు యోగానంద విశేషంగా కృషి చేసినట్లు స్వామీజీ తెలిపారు.
More Stories